కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు..

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహానేత కేసీఆర్

నకిరేకల్ మాజీ చిరుమర్తి లింగయ్య

కట్టంగూర్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిందని, ఆ పోరాటం యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని పేర్కొన్నారు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిందన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో! అనే నినాదంతో సాగించిన పోరాటం ప్రతి తెలంగాణ బిడ్డలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని తెలిపారు. ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. తెలంగాణ సాధించుకుంటేనే ఈ ప్రాంతానికి నిధులు, నీళ్లు, నియామకాల్లో న్యాయం జరుగుతుందని ప్రజలు దశాబ్దాలుగా పోరాటాలు సాగించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అణచివేసేందుకు అప్పటి పాలకులు ఎన్నో అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులకు పాల్పడినా కేసీఆర్ వెనుకడుగు వేయకుండా రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించి, పదవులను సైతం తృణప్రాయంగా వదిలి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమానికి మద్దతుగా తాను సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వామినయ్యానని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగం, పోరాటం, తెగువ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, కోట్లాది ప్రజల ఆత్మగౌరవం, ఎన్నో తరాల పోరాటాల ఫలితం, అమరవీరుల త్యాగాల ప్రతిరూపమన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ లు మాద ధనలక్ష్మి నగేష్, తరాల బలరాములు, దూదిమెట్లు సత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు, సర్పంచ్ లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1000438022.jpg

You may also like...