Daily Archive: November 28, 2026

ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో అక్రమాలు

దేవరుప్పుల: కడవెండి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సర్పంచ్ భాషిపాక రాములు, పంచాయతీ కార్యదర్శి టి. స్వప్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తీర్మానాలు, బిల్లులు, వోచర్లు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు, సర్పంచ్‌కు నిధులు చెల్లించినట్లు విచారణలో గుర్తించారు. సర్పంచ్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

కొత్త పెన్షన్లపై కాంగ్రెస్ సంబరాలు

దేవరుప్పుల: మండలంలో కొత్త పెన్షన్లకు నిధులు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దావేరా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణాసంచా పేల్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నూతన పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి

పాలకుర్తి: నవంబర్ 29న నిర్వహించనున్న బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పాలకుర్తి చౌరస్తాలో కార్యక్రమ స్థలాన్ని పార్టీ మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, స్థల ఎంపికపై నాయకులతో చర్చించి, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గడువులోగా భూముల రీసర్వే పూర్తి చేయాలి

జనగామ: భూముల రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జనగామ ఆర్డీఓ కార్యాలయంలో రీసర్వే పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మండలాలు, గ్రామాల వారీగా పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను తహసీల్దార్లు, సర్వేయర్లు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.