విదేశీ ఉద్యోగాలకు భారీ సబ్సిడీ

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనే ఆకాంక్షతో ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లే యువతపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయగా, తొలి ఏడాది 7 వేల మంది యువతకు ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించింది. విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన వీసా, విమాన ప్రయాణం, విదేశీ భాషా శిక్షణ తదితర ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీ అందించనుంది.

ఈ పథకం కింద అర్హులైన యువతకు కేటగిరీల వారీగా ఆర్థిక సహాయం అందించనున్నారు. మొదటి కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠంగా రూ.50 వేల వరకు, రెండో కేటగిరీ వారికి రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించడం ద్వారా ఉపాధి అవకాశాల్లో సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నిర్మాణ రంగం, తయారీ, ఆటోమొబైల్, వైద్య రంగం, హోటళ్లు తదితర పది రంగాల్లో విదేశీ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆయా రంగాల్లో విదేశీ ఉద్యోగాలకు అవసరమైన భాషా పరిజ్ఞానం, వృత్తిపరమైన నైపుణ్య శిక్షణను టామ్‌కామ్ (TOMCOM) ద్వారా అందించనున్నారు. విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలనుకునే యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నారు. తద్వారా విదేశీ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా యువతను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఒక రేషన్ కార్డుపై కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీకరణను టామ్‌కామ్ ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చేపట్టనున్నట్లు వెల్లడించింది. విదేశాల్లో ఉపాధి పొందాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఈ పథకం ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, విదేశీ ఉద్యోగాల కోసం ఎదురయ్యే ప్రారంభ ఖర్చులను తగ్గించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దోహదపడనుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

You may also like...