దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే.. అగ్నికి ఆహుతైన ఇల్లు! నగదు, ఇంటి సామగ్రితో పాటు ఫోటో స్టూడియో పరికరాలు బూడిద

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 28: రోజూ వెలిగించే దేవుడి దీపమే ప్రమాదానికి కారణమై, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కళ్లముందే బూడిదైపోవడంతో ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన మండలంలోని ఈదులూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడిసె రమేష్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం అతని భార్య కళ్యాణి దేవుని గదిలో దీపం వెలిగించి, అనంతరం రమేష్ ఫోటో స్టూడియోకు వెళ్లగా, కళ్యాణి నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీపం పక్కన ఉన్న వస్తువులకు మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు ఇళ్ళంతా వ్యాపించి విద్యుత్ తీగలకు అంటుకోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాద తీవ్రత పెరిగింది.ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. రూ.30 వేల నగదుతో పాటు బియ్యం, దుస్తులు, ఇంటి సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. రమేష్ జీవనాధారమైన ఫోటో స్టూడియోకు సంబంధించిన కెమెరా, నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లు, పాస్ ఫోటో మిషన్, ఇతర పరికరాలు సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న నగదు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే వస్తువులు, ఉపాధికి ఆధారమైన ఫోటో స్టూడియో సామగ్రి ఒక్కసారిగా కాలిపోవడంతో రమేష్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.1000436795.jpg

You may also like...