ప్రభుత్వ జాప్యం.. స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులకు శాపం!

జ్ఞానతెలంగాణ,స్టేట్ వెబ్ డెస్క్: ప్రభుత్వ యంత్రాంగపు జాప్యం, శాఖల మధ్య సమన్వయ లోపం, బాధ్యతల నుంచి తప్పించుకునే అధికారుల వైఖరి డీఎస్సీ-2024 స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారుతున్నాయి. రెండేళ్లుగా సర్టిఫికెట్ల పునఃపరిశీలన పేరుతో సాగుతున్న అంతులేని ప్రక్రియకు తెరపడకపోవడంతో అర్హత సాధించిన అభ్యర్థులు న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌కు నోటీసులు జారీ చేయడం అధికారుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహానికి అద్దం పడుతోంది. అందుబాటులో ఉన్న నియామకాల నివేదికతో శుక్రవారం స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలు రావడంతో విద్యాశాఖ వర్గాల్లో కలకలం రేగింది.

2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో భాగంగా 31 జిల్లాల్లో స్పోర్ట్స్‌ కోటా కింద రోస్టర్‌ పాయింట్లు 48, 98 ద్వారా మొత్తం 96 పోస్టులను భర్తీ చేసినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ ధ్రువపత్రాల పరిశీలనలో సాంకేతిక లోపాలు తలెత్తడం, కొందరు అనర్హులకు ఉద్యోగాలు దక్కాయనే ఆరోపణలు రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు 398 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను భౌతికంగా పునఃపరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తయినా తుది నివేదికకు ఆమోదం లభించకపోవడం, నియామకాలపై స్పష్టత రాకపోవడం అభ్యర్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. రెండేళ్ల ప్రొబేషన్‌ కాలం పూర్తయినప్పటికీ వివాదం పరిష్కారం కాకపోవడంతో స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియను విద్యాశాఖ నిలిపివేసినట్లు తెలుస్తోంది.

కమిటీ సమావేశాలకూ కొరతలే.. రెండో విడత ఫిజికల్‌ వెరిఫికేషన్‌ నివేదికకు తుది ఆమోదం తెలిపేందుకు ఏర్పాటు చేసిన హైలెవెల్‌ కమిటీ సమావేశాలు కూడా అధికారుల నిరాసక్తతతో ముందుకు సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాలకు డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ గైర్హాజరైనట్లు సమాచారం. కోర్టు ధిక్కరణ కేసు తీవ్రత పెరగడంతో మూడో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టినా సాధారణ పరిపాలన శాఖ అధికారుల నుంచి ఆశించిన స్పందన రాలేదని తెలుస్తోంది. డిసెంబర్‌లో నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయ క్రీడా పోటీల ఏర్పాట్లను కారణంగా చూపుతూ క్రీడాశాఖ అధికారులు సమావేశాలను వాయిదా వేస్తూ వచ్చినట్లు సమాచారం. ఈ నెల 25న సమావేశానికి క్రీడాశాఖ సిద్ధమైనప్పటికీ జీఏడీ అధికారుల స్పందన లేక తేదీ ఖరారు కాలేదు. శాఖల మధ్య సమన్వయ లోపం అభ్యర్థుల సమస్యను మరింత జటిలం చేస్తోంది.

23 రిట్‌ పిటిషన్లు.. అయినా స్పందన కరువు: తమకు అన్యాయం జరిగిందని జాతీయస్థాయి క్రీడాకారులు హైకోర్టులో 23 రిట్‌ పిటిషన్లతో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతి విచారణ సమయంలోనూ గడువు కోరుతూ కాలయాపన చేస్తున్న విద్యాశాఖ కనీసం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈసారి ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా రిజిస్ట్రీ ద్వారా నేరుగా డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేయడం వ్యవహారం తీవ్రతను స్పష్టం చేస్తోంది. అనర్హులుగా పేర్కొంటున్న కొందరు ఇప్పటికే ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ పొందగా, అర్హత సాధించిన తమ నియామకాలు మాత్రం పెండింగ్‌లో ఉంచడం వివక్షతో కూడిన వ్యవహారమని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

398 మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలన నివేదికకు తక్షణమే ఆమోదం తెలిపి న్యాయం చేయాలని కోరుతూ కే. హరికృష్ణ, పీ. దశరథ్‌, పొట్లం వెంకటేశ్‌ తదితరులు ఈ నెల 19న రాష్ట్ర హోంశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అర్హత, ప్రతిభ, క్రీడా విజయాల ఆధారంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను రెండేళ్లుగా అనిశ్చితిలో ఉంచడం పాలనా బాధ్యతల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక ఆమోదం, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, నియామకాలపై తుది నిర్ణయం వెంటనే తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారుల జాప్యానికి అభ్యర్థులు మూల్యం చెల్లించే పరిస్థితికి ముగింపు పలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

You may also like...