మూసీ సుందరీకరణ అదనపు భూసేకరణ ఆపాలి మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బాధితుల వినతి

318345.jpg

హైదరాబాద్: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో బఫర్ జోన్ పరిమితికి మించి చేస్తున్న అదనపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఈరోజు ఉదయం ఆయన అధికారిక నివాసంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బండ్లగూడ జాగీర్ (దర్గా కాలేజ్) ప్రాంత నివాసితులతో కలిసి కలిశారు. భూములు కోల్పోతున్న స్థానికులు తమ ఆవేదనను మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తాము మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే, నిబంధనల ప్రకారం ఉండాల్సిన బఫర్ జోన్ పరిమితిని దాటి, ఏకంగా 500 మీటర్ల వరకు భూములను సేకరించాలని చూడటం సరికాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం బఫర్ జోన్ పరిధి వరకే భూములను పరిమితం చేయాలని, ఇతర అభివృద్ధి పనులు లేదా హోటళ్ల నిర్మాణం కోసం తమ భూములను లాక్కోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత మంత్రుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు స్పష్టం చేశారు. స్థానికులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితుల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

You may also like...