రాజ్యాంగ పరిరక్షణే అందరి బాధ్యత: రహీం

జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్ ప్రతినిధి, నవంబర్ 26: భారత రాజ్యాంగ మౌలిక విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు రహీం అన్నారు. నారాయణఖేడ్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ పూలే సేవా సమితి డివిజన్ అధ్యక్షులు ఎస్. నర్సింలు ఆధ్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమితి రాష్ట్ర అధ్యక్షులు రహీం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య పునాది అని పేర్కొన్నారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించే రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే పరిణామాలను ఎదుర్కొంటూ, రాజ్యాంగ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.

అనంతరం సమితి రాష్ట్ర అడ్వైసర్, న్యాయవాది నాథన్ డ్యానీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టత, చట్టాలు, ప్రాథమిక హక్కులు, పౌరుల విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగంపై సమగ్ర అవగాహన కలిగి ఉన్నప్పుడే పౌరులు తమ హక్కులను సమర్థంగా కాపాడుకోగలరని పేర్కొన్నారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలను అధ్యయనం చేసి చైతన్యవంతులుగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్యాంగంపై చక్కగా ప్రసంగించిన విద్యార్థులకు ముఖ్య అతిథి రహీం, న్యాయవాది నాథన్ డ్యానీలు ప్రోత్సాహక పత్రాలను అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వర్, అంబేద్కర్ పూలే సంఘం నాయకులు గైని సాయిలు, గౌస్ చిస్తీ, నరసింహులు, వినోద్, మైనుద్దీన్, కురసి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ చిరంజీవి, కేవీపీఎస్ నాయకులు కొటారి నరసింహులు, బీఎస్పీ పండరి, భీమ్‌సేన కాజా మియా, తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సాపూర్ శంకర్, ఉపాధ్యాయులు జ్యోతి, లింగం, కళాశాల అధ్యాపకులు, అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...