రైతులకు నీరివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు?

రైతులకు నీరివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు?

కేసీఆర్ హయాంలో తెలంగాణ నంబర్‌ వన్‌.. .

కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు

మూసీ నీటిని వృథాగా వదులుతూ ప్రాజెక్టును ఖాళీ చేసే కుట్ర..

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 13 : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను ఒక్కటి కూడా పెండింగ్‌లో పెట్టకుండా అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిస్తే, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో రైతులకు సాగునీరు, విద్యుత్‌ అందించకుండా, వారు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం, ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం మంగళవారం నకిరేకల్‌ పట్టణంలోని సువర్ణ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించకుండా మూసీ నీటిని వృథాగా దిగువకు వదులుతున్నారని ఆరోపించారు. గత ఎనిమిది నెలలుగా మూసీ గేట్ల మరమ్మతులు చేయకపోవడంతో నీటి నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మూడో పంటకు ఎండాకాలంలోనూ సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టును ఖాళీ చేసి భవిష్యత్తులో రైతులకు నీరు అందకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతి వేసవిలోనూ చెరువులు నింపి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. మూడో పంటకు నీరు అందించాలని రైతులు పలుమార్లు అధికారులకు, కలెక్టర్లకు ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేసినా ఆశించిన ఫలితం కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వైఖరి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలకు ప్రాధాన్యమివ్వడం సరికాదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతుల రంగాల్లో పేద ప్రజలకు భరోసా కల్పించామని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతోపాటు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలని కోరారు. డిగ్రీ పూర్తి చేసిన యువత, ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన అర్హులైన పట్టభద్రులను గుర్తించి ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు నమోదు చేయించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదన్నారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, అభ్యర్థి ఏనుగుల రాకేష్‌ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1000376470.jpg

1000376471.jpg

You may also like...