కాన్షీరాం వర్ధంతి సందర్భంగా పండ్ల పంపిణీ
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా తాడ్వాయి ప్రతినిధి,అక్టోబర్ 9:
బహుజనుల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మాన్యవర్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో శతాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కుల వివక్ష, సామాజిక అణచివేతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను మార్చేందుకు బహుజనులు తమ ఓటు శక్తిని గుర్తించి, రాజ్యాధికారాన్ని సాధించాలని కాన్షీరాం పిలుపునిచ్చారని గుర్తుచేశారు. వ్యక్తిగత జీవితాన్ని, ఆస్తిపాస్తులను త్యజించి బహుజన సమాజ అభ్యున్నతికే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. “అడుక్కుంటే హక్కులు రావు.. పాలకులుగా మారాలి” అనే సందేశంతో అణగారిన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపారని పేర్కొన్నారు. బహుజన సమాజమే తన కుటుంబమని భావించి, సమానత్వం, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం పోరాడిన కాన్షీరాం ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గంలో బహుజనులు ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షుడు మర్లు సాయిబాబు, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షుడు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
