పెళ్లయిన తెల్లారే ప్రసవం.. వరుడికి ఊహించని షాక్!

వివాహబంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడికి పెళ్లయిన తెల్లారే ఊహించని షాక్ ఎదురైంది. పెళ్లి మరుసటి రోజు తెల్లవారుజామున కొత్త పెళ్లికూతురు ప్రసవించడంతో వరుడితో పాటు కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరునెల్వేలి సమీపంలోని అరియకుళం ప్రాంతానికి చెందిన వెంకటేశ్ (25) తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి ఏరాన్‌కుడిపాలం ప్రాంతానికి చెందిన పిచ్చమ్మాళ్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. జూన్ 29న నిశ్చితార్థం జరగగా, నవంబర్ 13న వివాహం జరిగింది. పెళ్లయిన మరుసటి రోజు తెల్లవారుజామున పిచ్చమ్మాళ్‌కు తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం మొదలైంది. దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్, అతడి సోదరి ఆమెను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బాత్రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్కడ మృత శిశువు కనిపించింది. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన వారు వెంటనే వెంకటేశ్‌కు సమాచారం అందించారు. శిశువు మృతదేహాన్ని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ పోస్టుమార్టం నిర్వహించినట్లు సమాచారం. పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేసి వివాహం చేశారని వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిచ్చమ్మాళ్ పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించిందని, అతడి వల్లే గర్భం దాల్చిందని ప్రాథమికంగా తెలిసినట్లు కథనంలో పేర్కొంది. ఆమెకు సుమారు ఏడు నెలల గర్భం ఉండగా, అబార్షన్ కోసం మాత్రలు వాడటం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

You may also like...