వ్యవసాయ వర్సిటీలో 566 అధ్యాపక పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 566 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో 48 ప్రొఫెసర్‌, 148 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 370 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. దీంతో వ్యవసాయ విద్య, పరిశోధనా రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించనుంది.

రాష్ట్రంలో కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, నూతన కోర్సుల ప్రవేశం, అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ప్రారంభంతో విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, వాటిని పరిశీలించిన ఆర్థిక శాఖ నియామకాలకు అనుమతులు మంజూరు చేసింది.

నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కేవలం రాతపరీక్ష ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్వ్యూలను మినహాయించాలని విశ్వవిద్యాలయ పాలకమండలి ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అయితే యూజీసీ, ఐకార్‌ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని సీఎం కార్యాలయం, ఆర్థిక శాఖ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ అనుమతులు లభించడంతో నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. పోస్టుల వారీగా అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, ఎంపిక ప్రమాణాలు తదితర వివరాలు నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

You may also like...