తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసు శాఖలో 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు సమాచారం. నియామక ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలను వేగవంతం చేసే దిశగా పోలీసు శాఖ కసరత్తు చేపట్టింది. పోలీసు శాఖ వార్షిక శిక్షణ క్యాలెండర్‌ రూపకల్పనతో పాటు హోంగార్డు పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ శుక్రవారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.

భవిష్యత్తులో పోలీసు శాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలు, సిబ్బంది సంక్షేమం, శిక్షణ వ్యవస్థ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీసు రిట్రీట్‌, మహిళా పోలీసు అధికారుల సదస్సు, తెలంగాణ నూతన పోలీసు మాన్యువల్‌ రూపకల్పనపై అధికారులతో డీజీపీ సమాలోచనలు జరిపారు. రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్‌ నిర్వహణ, ఆలిండియా పోలీసు క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏర్పాట్లు, తెలంగాణ పోలీసు శాఖకు మంజూరైన సిబ్బంది సంఖ్యపై సమీక్షించారు.

ప్రతి అంశానికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని, సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండటంతో ఉద్యోగ ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, నోటిఫికేషన్‌, అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

You may also like...