బైరాపూర్ వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?

1001404889.jpg

వెల్దండ నవంబర్ 27 :వెల్దండ మండలం బైరాపూర్ గ్రామ పరిధిలోని వాగులో మూలగుండు ప్రాంతం వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు, పరిసర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది ఇసుక వ్యాపారులు వాగులో పెద్దపెద్ద గుంతలు తవ్వి ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, దీంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాగులో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల భూగర్భ జలాలపై మరింత ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇంత బహిరంగంగా అక్రమ తవ్వకాలు, ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యవహారం కొనసాగుతోందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాగులో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై విచారణ చేపట్టి, అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like...