పెన్షన్ సాధనపై ఏమాత్రం సందేహం లేదు: కామ్రేడ్ డి.ఎస్. రఘు
- అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ - November 25, 2026
- బీమా సౌకర్యం జీపీ సిబ్బంది ఆర్ధిక భద్రత : పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె మాధవిసైదిరెడ్డి - November 24, 2026
- ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. శివాలయాల్లో భక్తుల సందడి.. దీపారాధనతో ఆధ్యాత్మిక శోభ - November 24, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 24,
ఎల్ఐసీలో 2012-13 బ్యాచ్ ఉద్యోగుల పెన్షన్ సాధన విషయంలో ఎలాంటి సందేహం లేదని, సాంకేతికంగా లేదా న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్లాల్సి వచ్చినా పోరాటం కొనసాగిస్తామని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి.ఎస్. రఘు స్పష్టం చేశారు. నల్లగొండ బ్రాంచ్ 1, 2 ఉమ్మడి సంయుక్త సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. పెన్షన్ సమస్య పరిష్కారంపై జాతీయ నాయకత్వం నుంచి స్పష్టమైన భరోసా ఉందని రఘు తెలిపారు. పెన్షన్ సాధనకు ఎలాంటి షార్ట్‌కట్ మార్గాలు లేవని, న్యాయవాదుల సలహాలతో చట్టపరమైన పరిధిలో క్రమశిక్షణతో కూడిన ఐక్య పోరాటం చేయడమే విజయ మార్గమని పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలోనూ న్యాయం జరిగేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. యూనియన్ను బలహీనపరిచే శక్తుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి, సంయమనం పాటించాలని సూచించారు. రానున్న డిసెంబర్ 27న హైదరాబాద్‌లో నిర్వహించే కంబైన్డ్ కాన్ఫరెన్స్‌కు జాతీయ నాయకత్వం హాజరవుతుందని రఘు వెల్లడించారు. కొత్త నియామకాలు (రిక్రూట్మెంట్) ప్రధాన ఎజెండాగా సాగే ఈ సభకు ఉద్యోగులు వంద శాతం హాజరై ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సంస్థ కోసం చివరి వరకు నిబద్ధతతో పనిచేస్తామని, భావి నాయకత్వం కూడా ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
నల్లగొండ బ్రాంచ్ 1, 2 అధ్యక్షులు కొప్పు వెంకన్న, ఏ. యాదగిరిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు యస్. గుణశేఖర్, జాయింట్ సెక్రెటరీ జావీద్, జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళ బాలస్వామి, బ్రాంచ్-2 మేనేజర్ ఆర్. లక్ష్మా, బ్రాంచ్ కార్యదర్శులు ఐతగోని లక్ష్మీనారాయణ, చిలుకూరి రమేష్, ఇతర నాయకులు రాములు యాదవ్, బెల్లంకొండ కన్నయ్య, భీమ్లా నాయక్, రవీందర్, ఏ. నర్సిరెడ్డి, వేముల కృష్ణయ్య, పోలే లింగయ్య, పి.మల్లేశం, పెద్ది రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఎల్. శ్రీనివాసులు, ఐ. శ్రీనివాసులు, ఎల్.రామకృష్ణ, వెంకటేశ్వర్లు, పొరకాల సైదులు, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ 1, 2 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
