ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి

కామారెడ్డి: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కోర్సులు పూర్తి చేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి, అనంతరం ఏఓ గారికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం భూములు అమ్ముతూ, వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నప్పుడు పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యార్థుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో చర్చించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ఉద్యమాన్ని ప్రభుత్వం తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాజీవ్ కుమార్, అఖిల్ రావు, రాజేందర్ రావు, నరేష్, రాజు, సోషల్ మీడియా నియోజకవర్గ ప్రతినిధి అనిల్, గడ్డం రవి తదితరులు పాల్గొన్నారు.

You may also like...