పండుగకు ఊరెళ్తున్నారా.. ఇంటి భద్రతపై ఓ కన్నేయండి!
- బీజేపీ మండల లేబర్ సెల్ కన్వీనర్‌గా శ్రీధర్ - October 13, 2026
- చిక్సిత పొందుతూ లైన్ మెన్ మృతి - October 13, 2026
- హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్ - October 12, 2026
పండుగకు ఊరెళ్తున్నారా.. ఇంటి భద్రతపై ఓ కన్నేయండి!
విలువైన ఆభరణాలు, నగదు ఇళ్లలో వదిలివెళ్లొద్దు
ప్రజలకు కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ సూచన
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 11: దసరా పండుగ.. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సమయం.. పండుగ సెలవులు రావడంతో చాలామంది సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. అయితే ఇంటికి తాళం వేసి ఊరెళ్లే సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం దొంగలకు అవకాశంగా మారవచ్చు. పండుగ సంతోషం ముగిసి ఇంటికి తిరిగొచ్చేసరికి చోరీ జరిగితే ఆ కుటుంబం పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ సూచించారు. దసరా సెలవుల నేపథ్యంలో ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు సూచనలు చేశారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను ఇళ్లలోనే వదిలివెళ్లకూడదని తెలిపారు. వీలైనంత వరకు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. బీరువాలు, ఇతర తాళాలు, విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇంటికి తాళం వేసి ఊరెళ్లే వారు ఇంటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. ఇంటి తాళాలను బయట నుంచి వేసినట్లు కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఊరికి వెళ్లే విషయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలని కోరారు.
అనుమానాస్పద వ్యక్తులపై నిఘా..
గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు డయల్ చేయాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామ శివారు కాలనీల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
రాత్రివేళల్లో పోలీసుల పెట్రోలింగ్..
పండుగ సెలవుల సమయంలో దొంగతనాలను అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో పోలీసుల పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు రాత్రి వేళల్లో తనిఖీలు చేపడతామని ఎస్ఐ వెల్లడించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అప్రమత్తంగా ఉంటే చోరీలను నివారించవచ్చని తెలిపారు. పండుగను ఆనందంగా జరుపుకొని క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేలా ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, విలువైన వస్తువుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
