ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్

తాడ్వాయి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ఎల్లారెడ్డి నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం బ్రహ్మాజీవాడి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధుల గుట్ట సిద్దేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన 36వ వార్షికోత్సవ జాతరలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు నిర్మిస్తానని ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షల వ్యయంతో పనులు పూర్తి చేయించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి ఆలయ మెట్లను కూడా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, బ్రహ్మాజీవాడి సర్పంచ్ అంజనబాయి-రఘుపతిరావు, ఉప సర్పంచ్ గాజే రాజు, తాడ్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సంజీవులు, సొసైటీ చైర్మన్లు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

You may also like...