మూడేళ్లుగా నిలిచిపోయిన గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి!

రామారెడ్డి: రామారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలోని గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గత మూడేళ్లుగా పనులు నిలిచిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిర్లక్ష్యం వీడి వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఈ మార్గం గుండా కాలభైరవ స్వామి దేవాలయం, బుగ్గ రామేశ్వర లింగం ఆలయం, భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట దేవాలయాలకు భక్తులు రాకపోకలు సాగిస్తారని, బ్రిడ్జి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు, భక్తుల సౌకర్యార్థం నిర్మాణం పూర్తి చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యేను ముట్టడించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, కాలభైరవ స్వామి ఆలయ మాజీ చైర్మన్ సతీష్ గుప్తా, మాజీ సర్పంచ్ పడిగెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ పోతునూరి ప్రసాద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జంగం లింగం, రైతుబంధు మాజీ అధ్యక్షుడు తిరుపతి, లాగల మైపాల్, హన్మల రాజయ్య, బల్దేవ్, అంజయ్య, రాజిరెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.

You may also like...