రిపోర్టర్, కామారెడ్డి | 9491912715
Latest posts by GADDAM RAVI
(see all) తాడ్వాయి: భారతీయ విద్యార్థి మోర్చా (BVM) ఆధ్వర్యంలో తాడ్వాయి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
కామారెడ్డి జిల్లా సీనియర్ న్యాయవాది సిద్ధిరాములు మాట్లాడుతూ మహిళలకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులు, మహిళల రక్షణ చట్టాలు, పోక్సో చట్టంపై వివరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించాలని, తమ హక్కులను తెలుసుకొని ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు.
బీవీఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, దాని విలువలను కాపాడుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాజ్యాంగ రూపకల్పనలో చేసిన అపార కృషిని వివరించారు. సమాజంలో అన్యాయాలు, అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు రాజ్యాంగబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు రాజ్యాంగాన్ని కూడా చదివి, హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రాజ్యాంగ విలువలను ఆచరణలో పాటిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయ బృందం మరియు బీబీఎం జిల్లా కన్వీనర్ రోహిత్, బీవీఎం రాష్ట్ర నాయకులు మనోజ్, బీఎంఎం జిల్లా అధ్యక్షులు రవి, బీవీఎం నాయకులు విజయ్, పీఏసీఎస్ తాడ్వాయి చైర్మన్ సుధాకర్ రావు, సామాజిక మోటివేషనల్ స్పీకర్ సంజీవ్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.