ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న భూగర్భ జలాలు
- ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న భూగర్భ జలాలు - October 30, 2026
- కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ - October 30, 2026
- నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి - October 30, 2026
ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఎండుతున్న బోర్లు.. ఎండమావిగా మారుతున్న సాగునీరు..
తాగునీటి కోసం తప్పని తిప్పలు
వర్షాభావానికి తోడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. రీఛార్జ్ కాని భూగర్భ జలాలు.. రైతుల బతుకుల్లో చీకట్లు
ప్రత్యేక కథనం
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 30 : ఒకప్పుడు వర్షం పడితే చాలు.. పొలాల్లో పచ్చదనం పరుచుకునేది. బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండేది. చెరువులు, కుంటలు నిండితే గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూడటం.. బోరు నుంచి నీరు వస్తుందో లేదోనని మోటారు ఆన్ చేసి ఆందోళనగా ఎదురుచూడటం రైతులకు నిత్యకృత్యంగా మారింది. గంటల తరబడి మోటారు నడిపినా చుక్కనీరు రాకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఓవైపు ఎల్‌నినో ప్రభావం.. మరోవైపు వర్షపాత లోటు.. ఇంకోవైపు విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు వెరసి భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. భవిష్యత్తులో తాగునీటికి సైతం కటకట ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.
7.52 మీటర్ల లోతుకు నీటిమట్టం
రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 7.52 మీటర్ల లోతుకు పడిపోయింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఏకంగా 3.11 మీటర్ల మేర తగ్గడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోవడం భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను పెంచుతుంది. కానీ వర్షపాతం తగ్గడంతో భూగర్భ జలాల పునరుద్ధరణకు అవకాశం లేకుండా పోతోంది.
బోరు వేస్తే నీరు వస్తుందన్న నమ్మకం కరువు
గతంలో 300 నుంచి 500 అడుగుల లోతులో బోరు వేస్తే నీరు లభించేది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. బోర్లు మరింత లోతుకు వేస్తున్నా నీరు పడుతుందన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఒక బోరు విఫలమైతే మరో బోరు.. అది కూడా విఫలమైతే ఇంకో బోరు.. ఇలా అప్పులు చేసి బోర్లు వేయిస్తున్న రైతులకు చివరకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడమే కాకుండా నీటి కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది. మరోవైపు పట్టణాలు, గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బోర్ల వినియోగం పెరగడం కూడా భూగర్భ జలాలపై ఒత్తిడిని పెంచుతోంది.
జిల్లాల్లోనూ గడ్డు పరిస్థితులే
భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 1,771 పీజోమీటర్ల ద్వారా నీటిమట్టాలను పరిశీలిస్తోంది. ఈ గణాంకాల ప్రకారం ఏడు జిల్లాల్లో నీటిమట్టాలు 10 నుంచి 15 మీటర్ల లోతుకు పడిపోగా, 19 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో ఉన్నాయి. మరో ఏడు జిల్లాల్లో ఐదు మీటర్లలోపే నీరు లభిస్తోంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 11.96 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోగా, గతేడాదితో పోలిస్తే 6.17 మీటర్ల మేర తగ్గింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
రైతు కళ్లముందే ఎండుతున్న పంటలు
భూగర్భ జలాల పతనం ప్రభావం మొదటగా వ్యవసాయ రంగంపైనే పడుతోంది. బోర్లపై ఆధారపడి సాగు చేసిన రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో పంటలు నీరందక దెబ్బతిన్నాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఒకవైపు.. కళ్లముందే ఎండిపోతున్న పంటలు మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొస్తుందన్న ఆశతో అప్పులు చేసి సాగు చేసిన రైతుకు చివరకు నష్టాలే మిగిలే పరిస్థితి నెలకొంది. పంటలకు నీరు అందకపోతే పశువులకు మేతగా మారుతున్న పొలాలను చూసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
తాగునీటికీ తప్పని కష్టాలు!
ఇప్పటివరకు సాగునీటి సమస్యగా కనిపిస్తున్న భూగర్భ జలాల పతనం రానున్న రోజుల్లో తాగునీటి సమస్యగా మారే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం బోర్లు, చేతిపంపులపై ఆధారపడుతుంటారు. నీటిమట్టాలు మరింత పడిపోతే గ్రామాల్లో తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2027 మే నెలాఖరు వరకు తాగునీటి సమస్యలు తీవ్రం కావచ్చని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, గ్రామీణ ఉపాధిపైనా ప్రభావం పడనుంది
ఇప్పటికైనా మేల్కొనకుంటే ముప్పే!
నీటి సమస్యకు కేవలం వర్షాలు లేకపోవడమే కారణం కాదు. అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించుకోకపోవడం కూడా ప్రధాన సమస్య. వర్షం పడినప్పుడు ఆ నీటిని చెరువులు, కుంటల్లో నిల్వ చేయడం, భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం అత్యవసరం. గ్రామాల్లో పూడికతో నిండిన చెరువులను పునరుద్ధరించాలి. చెక్‌డ్యామ్‌లు, ఫార్మ్పాండ్లు, కాంటూర్ బండ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పట్టణాలు, కాలనీల్లో వర్షపు నీటి సంరక్షణ గుంతలను ఏర్పాటు చేయాలి. విచ్చలవిడిగా బోర్లు వేయడాన్ని నియంత్రించడంతో పాటు నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నీరు ఉంటేనే జీవనం.. నీరు ఉంటేనే వ్యవసాయం.. నీరు ఉంటేనే భవిష్యత్తు. ప్రకృతి ఇచ్చే ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుకోకపోతే రానున్న రోజుల్లో నీటి కోసం పోరాటాలు తప్పవు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు మేల్కొని భూగర్భ జలాల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తు తరాలకు నీటి ఎద్దడి ఒక పెద్ద శాపంగా మారే ప్రమాదం ఉంది.
ప్రవీణ్ కుమార్ బొజ్జ ..
లెక్చరర్ & రిజిస్టర్డ్ జియాలజిస్ట్.
భూవిజ్ఞాన శాస్త్ర విభాగం
డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నల్లగొండ.
