నీటి దొంగలకు ఇక జరిమానా వేట!
- నీటి దొంగలకు ఇక జరిమానా వేట! - October 29, 2026
- ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఉద్యోగులకు సెలవు! - October 29, 2026
- స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం.. 68 మంది మృతి! - October 29, 2026

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: నగరంలో తాగునీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. నీటిని నిర్లక్ష్యంగా వృథా చేసే వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించేందుకు ‘PAANI’ పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో కలిసి ఈ యాప్ను ఆవిష్కరించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు ప్రజల్లో జలసంరక్షణపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
నీటిని వృథా చేస్తున్న దృశ్యాలను ఫొటోలు, వీడియోల రూపంలో యాప్లో అప్లోడ్ చేసి పౌరులు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలించి ఉల్లంఘనలు నిర్ధారణ అయిన తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. నీటిని బాధ్యతారహితంగా వినియోగించే ధోరణికి అడ్డుకట్ట వేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జలమండలి పేర్కొంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలను పెంచుకునే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇల్లు, అపార్ట్మెంట్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నీటిని వృథా చేసే వారిపై జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.
‘సేవ్ వాటర్ వాలంటీర్’గా నమోదు చేసుకుని జలసంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జలమండలి అవకాశం కల్పించింది. ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని మంత్రి ప్రకటించారు.
హైదరాబాద్ నగరానికి రోజుకు సుమారు 100 ఎంజీడీల నీటి కొరత ఉందని, వివిధ జలాశయాల నుంచి 60 ఎంజీడీల నీటిని సర్దుబాటు చేస్తున్నట్లు జలమండలి తెలిపింది. మిగిలిన కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని ఎండీ అశోక్ రెడ్డి కోరారు. యాప్ ద్వారా ఫిర్యాదులను పారదర్శకంగా పరిశీలించి, నిబంధనలను సమర్థంగా అమలు చేసినప్పుడే ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాలను సాధిస్తుంది. ప్రజల సహకారంతో నీటి వృథాను అరికట్టి హైదరాబాద్ భవిష్యత్తు నీటి అవసరాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా జలమండలి ముందుకు సాగుతోంది.



