విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు కీలకం: డీఈఓ మల్లికార్జున్

తాడ్వాయి: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని కలిగించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మల్లికార్జున్ అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మండలస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను డీఈఓ మల్లికార్జున్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే లక్షణాలు అలవడతాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల్లో క్రీడాకోటా ద్వారా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జట్లకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి దాతలు, క్రీడాభిమానులు ముందుకు వచ్చి విద్యార్థులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామస్వామి, ఎంపీడీఓ భరత్ కుమార్, క్రీడా దాతలు భూపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వినోద్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారు సంజీవులు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ రాజా గౌడ్, కన్కల్ సర్పంచ్ మైలారం రవి, తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రావు, దేమికలాన్ సింగిల్ విండో చైర్మన్ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, మహేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...