బహుజన రాజ్యాధికారమే కాన్షీరాం లక్ష్యం
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:
బహుజనుల రాజకీయ చైతన్యానికి బాటలు వేసి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మాన్యవర్ కాన్షీరాం ఆశయాలను సాధించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని బహుజన విద్యార్థి మూమెంట్ (బీవీఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు బాన్సువాడ వేదాంత్ మౌర్య పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల మైదానం ముందు కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా బీవీఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదాంత్ మౌర్య మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నప్పటికీ, ఆచరణలో ధనబలం, అధికార బలం రాజకీయాలను శాసిస్తున్నాయని విమర్శించారు. “డబ్బున్నోడి నోటు.. పేదోడి ఓటు” అనే రాజకీయ చదరంగంలో సామాన్యులు బలిపశువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా కాన్షీరాం ప్రస్తావించిన సామాజిక, రాజకీయ అసమానతలను గుర్తుచేస్తూ, “మేమెంతో మాకంత.. ఓట్లు మావి, సీట్లు నీవా? నహీ చలేగా!” అనే నినాదంతో బహుజన రాజ్యాధికారం కోసం ఆయన అలుపెరుగని పోరాటం సాగించారని పేర్కొన్నారు. బహుజన ఉద్యమాన్ని దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా మలిచి, మాయావతిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదిగే స్థాయికి తీసుకెళ్లడంలో కాన్షీరాం కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం విద్యార్థులు సంఘటితమై, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవ్ ఎడ్యుకేషన్ ఫోరం అధ్యక్షుడు వంగూరి సిద్ధార్థ, ఎస్టీఎస్ఏ అధ్యక్షుడు తాళ్ల అజయ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మేడి పవన్ దేవాన్ష్, బహుజన విద్యార్థి నాయకుడు సందీప్ దళపతి తదితరులు పాల్గొన్నారు.
