బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి


జ్ఞాన తెలంగాణ, నారాయణపేట:


బాలికలు విద్య, ఉపాధి, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ బాలికలు విద్యకు ప్రాధాన్యమిస్తూ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. బాల్యవివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక దురాచారమని, వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. “బాల్యవివాహాలను అంతం చేద్దాం–బాలికల హక్కుల కోసం పెట్టుబడి పెడదాం” అనే సందేశాన్ని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సంగీత మాట్లాడుతూ బాలికల విద్య, భద్రత, సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్వేత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్ట్ అనిత, ఇన్‌చార్జి డీసీపీవో కరిష్మా, సఖి సీఏ క్రాంతి, లీగల్ కౌన్సిలర్ రామాదేవి, అధ్యాపకులు సునీత, పారిజాత, ప్రభావతి, వెన్నెల, విద్య, శైలజ తదితరులు పాల్గొన్నారు.

You may also like...