హైవే పక్కన వాహనాల నిలిపివేత మృత్యుశకటాలుగా మారుతున్న రహదారులు అక్రమ పార్కింగ్‌తో ప్రాణాలకు ముప్పు
హైవే పక్కన వాహనాల నిలిపివేత
మృత్యుశకటాలుగా మారుతున్న రహదారులు
అక్రమ పార్కింగ్‌తో ప్రాణాలకు ముప్పు
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్. ఆగస్టు 29 : రోడ్డు పక్కన ఆపిన వాహనమే ప్రాణం తీస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి…కట్టంగూర్: హైదరాబాద్–విజయవాడ 65వ జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్ వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల నుంచి పామనుగుండ్ల వరకు హైవే పక్కన భారీ లారీలు, కంటైనర్లు, ఇతర వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా దాబాలు, హోటళ్ల వద్ద రోడ్డుపైనే వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది.
చీకట్లో కనిపించక.. క్షణాల్లో విషాదం
రాత్రివేళ, తెల్లవారుజామున మసక వెలుతురులో రహదారిపై నిలిపిన భారీ వాహనాలు వెనుక నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, కార్లకు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఎలాంటి సూచికలు, హెచ్చరిక లైట్లు లేకుండానే వాహనాలను రోడ్డుపై నిలిపివేస్తున్నారు. దీంతో వాహనదారులు చివరి క్షణంలో గుర్తించి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు.
ఒకరి నిర్లక్ష్యం.. ఎన్నో కుటుంబాలకు తీరని లోటు..
వాహనాన్ని రోడ్డుపై కాసేపు నిలిపిన డ్రైవర్‌కు అది సాధారణ విషయమే కావచ్చు. కానీ అదే వాహనం వెనుక నుంచి వచ్చే వ్యక్తి జీవితాన్ని బలితీస్తే.. అతడిని నమ్ముకున్న కుటుంబం పరిస్థితి ఏంటి? కుటుంబానికి అండగా ఉన్న తండ్రి, భర్త లేదా కొడుకు ఒక్కసారిగా దూరమైతే ఆ ఇంటి పరిస్థితి తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. కోదాడలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో హైవేపై ఇలాంటి ప్రమాదకర పరిస్థితులపై స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది.
భయంతోనే ప్రయాణం
హైవేపై ప్రయాణం చేస్తుంటే ఎక్కడ రోడ్డుపై లారీ ఆపి ఉంటుందో.. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంటుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. ముందుగానే ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
అధికారుల నిఘా ఏది?
హైవేపై భారీ వాహనాల అక్రమ పార్కింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు, జాతీయ రహదారి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచడంతో పాటు నో-పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపే వారిపై భారీ జరిమానాలు విధించాలని సూచిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం లేని దాబాలు, హోటళ్ల నిర్వాహకులకు కూడా నిబంధనలు పాటించేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాదంలో పోయేది కేవలం ఒక ప్రాణం కాదు.. ఒక కుటుంబానికి ఆధారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైవేపై అక్రమ పార్కింగ్‌కు అడ్డుకట్ట వేసి, వాహనదారుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.

