రైతుల ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

లింగంపేట్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రైతులను కలిసి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ సన్న వడ్లను కేవలం రూ.2,800కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు బోనస్ కూడా చెల్లించడం లేదని విమర్శించారు. దొడ్డు వడ్ల కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో పాటు క్వింటాల్‌కు ఆరు కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
గత 40 రోజులుగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దే నిల్వ ఉంచుకొని ఎదురుచూస్తున్నారని తెలిపారు. లింగంపేట్ మండలం భవానీపేట్ గ్రామంలో కర్ణాటకకు చెందిన దళారులు సుమారు 10 లారీల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు డబ్బులు చెల్లించకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సన్న వడ్లకు వెంటనే బోనస్ చెల్లించాలని, యాసంగి రైతుబంధు నిధులు విడుదల చేయాలని, సన్న, దొడ్డు వడ్లను ఎలాంటి కోతలు, తరుగు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా సహకార అధికారి (DCO)తో ఫోన్‌లో మాట్లాడి, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
రాబోయే రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోతే జిల్లా బంద్‌తో పాటు కలెక్టరేట్ ముట్టడి చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒరిగిందేమీ లేదని, సభలు నిర్వహించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించడం తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు కేటీఆర్ అని, సిద్ధిపేటను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు హరీష్ రావు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

You may also like...