అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

షాద్‌నగర్‌: రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్‌ ఐసీడీఎస్‌ అధికారి ఉదయ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 26 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఖాళీలను గ్రామాలు, వార్డుల వారీగా నోటిఫికేషన్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు, వయోపరిమితి, స్థానికత తదితర నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అధికారి ఉదయ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో పోస్టు ఖాళీగా ఉందో, ఆ కేంద్రం పరిధికి చెందిన స్థానిక మహిళా అభ్యర్థులకు నిబంధనల మేరకు అర్హత ఉంటుందని వివరించారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు.

దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు కొనసాగుతుందని ఐసీడీఎస్‌ అధికారి ఉదయ తెలిపారు. చివరి తేదీ అనంతరం దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉండకపోవచ్చని, అర్హత ఉన్న మహిళలు చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు విధానం, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియతో పాటు ఇతర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చని తెలిపారు.

షాద్‌నగర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీల వివరాలను పరిశీలిస్తే కొందుర్గు మండలంలో 6, కేశంపేటలో 6, కొత్తూరులో 1, చౌదర్‌గూడలో 1, నందిగామలో 3, ఫరూఖ్‌నగర్‌లో 8, షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలో 1 చొప్పున మొత్తం 26 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారి ఉదయ వెల్లడించారు.

గ్రామాల వారీగా కొందుర్గు మండలంలో రేగడి చిలకమర్రి, కొత్త ఆగిరాల, వెంకిర్యాల, తంగేళ్లపల్లి, ముట్పూర్‌ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. చౌదర్‌గూడ మండలంలోని కాసులాబాద్‌, కేశంపేట మండలంలోని చింతకుంటపల్లి, తొమ్మిది రేకుల, కొత్తపేట, పాటిగడ్డ, బైర్ఖాన్‌పల్లి, మంగలిగూడ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నందిగామ మండలంలోని మొదళ్లగూడ, వీర్లపల్లి పరిధిలోని చెర్ల అంతిరెడ్డిగూడ, మామిడిపల్లి పరిధిలోని నసుర్లాబాద్‌ ప్రాంతాలు కూడా ఖాళీల జాబితాలో ఉన్నాయి.

ఫరూఖ్‌నగర్‌ మండలంలో మేలగూడ తండా, చించోడ్‌ పరిధిలోని పటేల్‌కుంట తండా, పులిచెర్లకుంట తండా పరిధిలోని కర్ణకుంట తండా, గంట్లవెళ్లి తండా, దొంతికుంట తండా, బుచ్చిగూడ, రంగంపల్లి, దేవునిపల్లి పరిధిలోని ఆర్‌ఆర్‌ గూడ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని చటాన్‌పల్లిలో అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించి టీచర్‌ పోస్టు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ రంగంలో సేవలందించాలనే ఆసక్తి ఉన్న అర్హత కలిగిన స్థానిక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్‌ అధికారి ఉదయ కోరారు.

You may also like...