పేదరికాన్ని అధిగమించి పోలీస్ స్పోర్ట్స్‌లో పతకాల వేట.. జ్యోద్య నాయక్‌కు రెండు మెడల్స్!

1001406050.jpg

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 27: పట్టుదల ఉంటే పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపిస్తున్నాడు వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన యువ కానిస్టేబుల్ జ్యోద్య నాయక్. తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు పతకాలు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-5లో గురువారం జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం, శుక్రవారం నిర్వహించిన లాంగ్ జంప్‌లో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య ఆయనకు ప్రశంసాపత్రం అందజేశారు.మారుమూల తండాలో పేదరికంలో పుట్టి, చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తితో రాష్ట్రస్థాయిలో పలు పతకాలు సాధించిన జ్యోద్య నాయక్ పట్టుదలతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని టీజీపీఎస్ మూడో బెటాలియన్ రేంజ్-2లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ క్రీడలపై మక్కువను కొనసాగిస్తూ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ రెండు పతకాలు సాధించడంపై గ్రామస్తులు, పోలీస్ సహచరులు హర్షం వ్యక్తం చేస్తూ జ్యోద్య నాయక్‌ను అభినందిస్తున్నారు.

You may also like...