ధాన్యం తరలింపులో అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన రైతు!
- సర్పంచ్‌పై కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు.. రూ.30 వేల పన్ను సొమ్ము దుర్వినియోగంపై విచారణకు ఆదేశాలు - November 23, 2026
- ధాన్యం తరలింపులో అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన రైతు! - November 23, 2026
- గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల అనారోగ్యంపై విచారణ జరిపించాలి - November 23, 2026
తాడ్వాయి: పంట పండించేందుకు నెలల తరబడి శ్రమించిన రైతుకు ధాన్యం విక్రయించిన తర్వాత కూడా కష్టాలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి ఐదు రోజులు గడిచినా గోదాముకు తరలించకపోవడంతో విసిగిపోయిన కృష్ణాజివాడి గ్రామానికి చెందిన రైతు ఏనుగు రమేష్ రెడ్డి సోమవారం నిరసనకు దిగాడు.
తాడ్వాయి మండలం దేవాయిపల్లి శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రమేష్ రెడ్డికి చెందిన 467 బస్తాలు, బద్దం రామిరెడ్డికి చెందిన 407 బస్తాలను అధికారులు తూకం వేశారు. అయితే ఐదు రోజులైనా ధాన్యం తరలించకపోవడంతో రైతు సింగిల్ విండో సీఈఓ నరసింహులును సంప్రదించాడు. లారీలు అందుబాటులో లేవని, సొంత ట్రాక్టర్లో గోదాముకు తీసుకెళ్లాలని సీఈఓ సూచించడంతో 100 బస్తాలను ట్రాక్టర్లో తరలించాడు. అయితే జీపీఎస్ ట్రాకర్ ఉన్న వాహనాల్లో వచ్చిన ధాన్యాన్నే గోదాములో దించుకుంటామని, ట్రాక్టర్‌కు జీపీఎస్ లేకపోవడంతో ధాన్యం తీసుకోలేమని గోదాము సిబ్బంది నిరాకరించారు.
దీంతో ఆగ్రహానికి గురైన రైతు కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పది వడ్ల బస్తాలను వేసి నిరసన తెలిపాడు. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రావు అక్కడికి చేరుకుని రైతుతో చర్చించారు. ట్రాక్టర్ అద్దె, హమాలీ ఖర్చులు భరిస్తామని హామీ ఇవ్వడంతో రైతు ఆందోళన విరమించాడు.
ఈ సందర్భంగా రైతు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో వ్యవహరించకపోవడం వల్లే తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తూకం వేసిన ధాన్యాన్ని ఐదు రోజుల పాటు తరలించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మిగిలిన ధాన్యాన్ని వెంటనే గోదాముకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు.
