ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవుల్లో మాల, మాదిగలకు చోటేది? అంబేద్కర్ సంఘ కామారెడ్డి జిల్లా కమిటీ

కామారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) చైర్మన్‌, పాలకవర్గ పదవుల నియామకాల్లో మాల, మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం దురదృష్టకరమని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లన్న ఆరోపించారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేసి ఎస్సీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. గతంలో రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానం ద్వారా సహకార సంఘాల పదవుల్లో మాల, మాదిగలకు ప్రాతినిధ్యం లభించేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నామినేషన్‌ విధానంలో చైర్మన్లు, సభ్యులను నియమించేలా చట్టాన్ని సవరించినప్పటికీ, రిజర్వేషన్లు కేటాయించకపోవడంతో ఎస్సీ నాయకులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ విధానం వల్ల మాల, మాదిగలు రాజకీయంగా ఎదిగే అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎస్సీలకు ఒక్క పదవి కూడా లేదా?కామారెడ్డి నియోజకవర్గంలోని 12 సహకార సంఘాలకు గాను ఇప్పటికే 8 సంఘాల చైర్మన్లు, కమిటీలను నియమించగా, ఆరు పదవులు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారని వారు పేర్కొన్నారు. అయితే ఒక్క పదవి కూడా ఎస్సీ మాల, మాదిగలకు దక్కలేదని తెలిపారు. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 17 సహకార సంఘాలకు గాను 14 సంఘాల చైర్మన్లను నియమించగా, ఐదు పదవులు రెడ్డి సామాజిక వర్గానికి, ఎనిమిది బీసీలకు, ఒకటి ఎస్టీకి కేటాయించారని వివరించారు. ఇక్కడ కూడా ఎస్సీలకు ఒక్క పదవి ఇవ్వకపోవడం వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. మాల, మాదిగలు కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచినప్పటికీ, ఆ పార్టీ ప్రభుత్వంలోనే తమకు అన్యాయం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని ఎస్సీ సెల్‌ నాయకులు, ఎస్సీ ప్రజాప్రతినిధులు ఈ విషయంపై మౌనం వీడి పార్టీ పెద్దలను ప్రశ్నించాలని సూచించారు. “అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు” అనే సామెతను గుర్తుచేస్తూ, ఎస్సీలకు రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం నాయకులు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, మాల, మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే భావన ప్రజల్లో బలపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తోళ్ల గంగారాం, జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గైని రాజు పాల్గొన్నారు.

You may also like...