రాజ్‌ఘాట్‌ వద్ద ఇండియా కూటమి నేతల నిరసన

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి:
దిల్లీలో ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కన్నాట్‌ ప్లేస్‌ నుంచి రాజ్‌ఘాట్‌ వరకు నేతలు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సద్బుద్ధి కలగాలని రాజ్‌ఘాట్‌ వేదికగా ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల హక్కులు, ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఇండీ కూటమి నేతలు డిమాండ్‌ చేశారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్‌ఘాట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు స్పష్టం చేశారు.

You may also like...