గంజాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలం
- పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వైపు ఇండీ కూటమి నేతలు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి నేతల నిరసన - October 8, 2026

అమరావతి: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీల పరిస్థితి ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయి లేకుండా చేస్తానని హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన సవాల్ ఏమైందని ప్రశ్నించారు. టీవీ షోలు, టీఆర్పీలపై చూపుతున్న శ్రద్ధను గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై చూపించాలని హితవు పలికారు. రాష్ట్రంలో గంజాయి, లిక్విడ్ గంజాయి, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని శ్యామల ఆరోపించారు. ఇటీవల అనకాపల్లిలో రూ.3 కోట్ల విలువైన గంజాయి, అల్లూరి జిల్లాలో రూ.1.34 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయి పట్టుబడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. ప్రకాశం జిల్లాలో పోలీసుల కారులోనే గంజాయి లభించడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘ఈగల్’ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో వేలాది కేసులు నమోదై, 6 లక్షల కిలోలకు పైగా గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్న శ్యామల.. అలాంటప్పుడు రాష్ట్రంలో గంజాయి లేదని ఎలా ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన ఆపరేషన్ చైతన్య, గరుడ వంటి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ఆరోపించారు. యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇకనైనా ప్రకటనలు, రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని శ్యామల డిమాండ్ చేశారు.
