రామాలయ విరాళాల చోరీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం!
- ఆసియా విద్యారంగంలో ఐఐటీ హైదరాబాద్ దూకుడు.. - November 4, 2026
- న్యాయశాఖలో బదిలీల కలకలం.. 24 మంది జడ్జీలకు స్థానచలనం - November 4, 2026
- పార్ట్‌టైమ్ లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత - November 4, 2026

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిలదీసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పూర్తయిందని, ఎనిమిది మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆలయ ట్రస్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తుల పాత్రను సమగ్రంగా పరిశీలించకుండానే కేసును ముగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
కేవలం 45 రోజుల వ్యవధిలో సీసీటీవీ కెమెరాల్లో 105 చోరీ ఘటనలు నమోదైనట్లు పేర్కొంటూ, ఇప్పటివరకు రూ.79.85 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు వచ్చిన సమాచారంపై ఆయన ప్రశ్నలు సంధించారు. మొత్తం ఎంత నగదు చోరీకి గురైంది? ఇంకా ఎంత మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలి? 105 ఘటనలకు సంబంధించిన ఫుటేజీ మాత్రమే ఎందుకు అందుబాటులో ఉంది? అని నిలదీశారు. ట్రస్ట్ ప్రతినిధులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులను సాక్షులుగా పేర్కొనడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
2020 ఆడిట్ నివేదికలోనే ఆర్థిక నిర్వహణలో లోపాలు ప్రస్తావించారని, వాటిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరారు. జూన్ 4న నగదు స్వీకరణకు సంబంధించిన వీడియో, జూన్ 5న సీసీటీవీ ఫుటేజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ జూన్ 25న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. మధ్యలో 21 రోజుల జాప్యానికి కారణాలేంటని నిలదీశారు. ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి వచ్చిన విరాళాలు, నగదు, బంగారం, వెండి, బ్యాంకు ఖాతాలు, ఖర్చులపై స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి 82 రోజులు గడిచినా ప్రోరోగ్ చేయకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. డీలిమిటేషన్ బిల్లు కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించే యోచనతోనే జాప్యం జరుగుతోందని ఆరోపించారు. అరుణాచల్ జనతా పార్టీ ఏర్పాటు వెనుక కూడా అమిత్ షా రాజకీయ వ్యూహం ఉందంటూ విమర్శలు గుప్పించారు.
