సీడ్ గణేశుడినే పూజించండి: చిరంజీవి పిలుపు
- సీతక్కకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఘాటు ప్రశ్న - August 31, 2026
- కామ పిశాచి కిరాతకం - August 31, 2026
- గద్వాల మార్కెట్ యార్డులో భారీగా గంజాయి పట్టివేత..! - August 31, 2026

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మలచాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయకులతో పాటు సీడ్ గణేశుడిని పూజించే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పండుగ భక్తికి ప్రతీకగా నిలవడంతో పాటు ప్రకృతి సంరక్షణకు మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షించారు.
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ రూపొందించిన సీడ్ గణేశుడి ప్రతిమలను చిరంజీవి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడ్ గణేశుడి ప్రత్యేకతను వివరించిన చిరంజీవి.. మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. పూజ అనంతరం సీడ్ గణేశుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసి, అందులోని విత్తనాలను మొలకెత్తిస్తే ఆ చిన్న ప్రయత్నమే భవిష్యత్తులో పెద్ద పచ్చదనానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు.
సాధారణంగా వినాయక నిమజ్జనాల అనంతరం విగ్రహాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, విషపూరిత రంగులు నీటి వనరులను కలుషితం చేసే ప్రమాదం ఉందని, అందువల్ల పర్యావరణహిత విగ్రహాలను ఎంచుకోవడం అత్యవసరమని చిరంజీవి పేర్కొన్నారు. భక్తి పేరుతో ప్రకృతికి నష్టం కలిగించడం సమర్థనీయం కాదని, పండుగను పర్యావరణహితంగా నిర్వహించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన సందేశం ఇచ్చారు.
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను సంతోష్ కుమార్ ఒక యజ్ఞంలా భావించి ముందుకు తీసుకెళ్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. ఇప్పటికే లక్షలాది మందిని మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేసి, సుమారు 20 కోట్ల మొక్కలు నాటేలా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. పచ్చదనం పెంపు కోసం సంతోష్ కుమార్ చేస్తున్న కృషికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
వినాయక చవితి వేడుకలను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా ప్రకృతి పరిరక్షణకు ఒక ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో సీడ్ గణేశుడిని పూజించి, నిమజ్జనం అనంతరం మొక్కను పెంచితే భక్తి, పర్యావరణ బాధ్యత రెండూ ఏకకాలంలో నెరవేరుతాయని ఆయన సూచించారు.


