విజయ్‌ సర్కారుకు కాంగ్రెస్‌ ధమ్కీ!

తమిళనాడు అధికార కూటమిలో ముసలం ముదిరింది. అధికార భాగస్వాముల మధ్య దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిరంగ రణంగా మారాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా గడువు ఉండగానే ప్రధాని పీఠంపై మిత్రపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని ఏమాత్రం దాచుకోకుండా టీవీకేపై నేరుగా ఒత్తిడి పెంచింది. 2029లో రాహుల్‌ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అని తేల్చిచెప్పిన కాంగ్రెస్‌.. దీనిని టీవీకే అంగీకరించకపోతే కేబినెట్‌ నుంచి తమ మంత్రులు మూకుమ్మడిగా వైదొలగే పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. కన్యాకుమారిలో జరిగిన కాంగ్రెస్‌ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఎస్‌. రాజేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు కూటమిలోని అసలు లెక్కలను బయటపెట్టాయి. రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడం కాంగ్రెస్‌ పార్టీకి అంతిమ రాజకీయ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. టీవీకే దీనిని తిరస్కరిస్తే తమ ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు వస్తారని ప్రకటించారు. దీంతో మిత్రపక్షాల మధ్య నడుస్తున్న రాజకీయ సర్దుబాట్లు ఇప్పుడు బహిరంగ బెదిరింపుల స్థాయికి చేరుకున్నాయి. విజయ్‌ను భవిష్యత్‌ ప్రధానిగా టీవీకే నేతలు చేస్తున్న ప్రచారమే ఈ మంటలకు ప్రధాన కారణంగా మారింది.

ముఖ్యమంత్రి విజయ్‌ జాతీయ నాయకత్వానికి అర్హుడని, ఆయన దేశ ప్రధానిగా ఎదగాల్సిన అవసరం ఉందని టీవీకే నేతలు వరుసగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అసెంబ్లీలోనే మంత్రి డి. శరత్‌కుమార్‌ విజయ్‌ తదుపరి ప్రధాని అవుతారని ప్రకటించడం వివాదాన్ని మరింత రాజేసింది. మరో మంత్రి ఆధవ్‌ అర్జున దక్షిణాది నుంచి దేశానికి ప్రధాని రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో అసంతృప్తిని పెంచింది. దీంతో విజయ్‌ జాతీయ రాజకీయ ఆశయాలపై టీవీకేలో మొదలైన ప్రచారాన్ని కాంగ్రెస్‌ తన రాజకీయ భవిష్యత్‌కు విసిరిన సవాలుగా చూస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ తన చేతిలో ఉన్న సంఖ్యాబలాన్ని పదేపదే గుర్తుచేస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ పరిస్థితులు ఏర్పడినప్పుడు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతోనే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏర్పాటులో తమ మద్దతు కీలకమన్న విషయాన్ని గుర్తు చేస్తూ టీవీకేకు రాజకీయంగా హెచ్చరికలు పంపుతున్నారు.

అధికార భాగస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తమ డిమాండ్‌ను గౌరవించాల్సిందే అన్న సంకేతాన్ని కాంగ్రెస్‌ బలంగా ఇస్తోంది. ఒకవైపు విజయ్‌ను రాష్ట్ర సరిహద్దులు దాటించి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలబెట్టాలని టీవీకే వర్గాలు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. దీంతో కూటమిలో భాగస్వామ్యం కంటే నాయకత్వ ఆధిపత్యమే ప్రధాన పోరుగా మారింది. మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరితే అది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాజీనామాలు, చివరకు ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఎన్నికలకు మూడేళ్ల ముందే ప్రధాని పదవిపై మిత్రపక్షాలు పరస్పరం కత్తులు నూరుకోవడం సంకీర్ణ ప్రభుత్వంలో పెరుగుతున్న అనిశ్చితికి నిదర్శనంగా మారింది. విజయ్‌ నాయకత్వాన్ని కాంగ్రెస్‌ అడ్డుకుంటుందా? రాహుల్‌ పేరుకు టీవీకే తలొగ్గుతుందా? లేక కాంగ్రెస్‌ హెచ్చరికను సవాల్‌ చేసి కూటమినే పణంగా పెడుతుందా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తమిళనాడు రాజకీయాల్లో అసలు యుద్ధం 2029 ఎన్నికల సమయంలో కాదు.. ఎన్నికలకు మూడేళ్ల ముందే మొదలైనట్లుగా కనిపిస్తోంది. అధికార కూటమిలోని ఈ ఆధిపత్య పోరు మరింత భగ్గుమంటే విజయ్‌ సర్కారుకు రాజకీయంగా గట్టి పరీక్ష తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

You may also like...