.20 వేలకు రూ.లక్ష ఆశ.. భారీ మోసంపై బాధితుల ఆందోళన!

1001405209.jpg

కల్వకుర్తి,నవంబర్ 27:తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామంటూ ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వ్యవహారం కొనసాగించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.రూ.20 వేలు చెల్లిస్తే రూ.లక్ష ఇస్తామని, రూ.లక్షలో రూ.80 వేలు నెలవారీ వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుందని నమ్మించి బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు తెలిపారు. మధ్యవర్తులుగా కొంతమంది మహిళలను సేల్స్ మేనేజర్లుగా నియమించుకొని వసూళ్లు చేసినట్లు పేర్కొన్నారు.రూ.20 లక్షలు చెల్లిస్తే కోటి రూపాయలు ఇస్తామంటూ మరికొందరి నుంచి భారీ మొత్తాలు వసూలు చేసినట్లు ఆరోపించారు.మొదట కొందరికి డబ్బులు తిరిగి ఇచ్చి నమ్మకం కలిగించి, ఆ తర్వాత భారీ మొత్తాలు చెల్లించిన వారికి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు.ఈ క్రమంలో వెల్దండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటిని బాధితులు ముట్టడించారు. గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించి నిర్వాహకుడిని చరవాణి ద్వారా సంప్రదించగా మూడు గంటల్లో వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు బాధితులు వాపోయారు. అనంతరం మహిళా మధ్యవర్తులతో కలిసి నిర్వాహకుడి కోసం హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిపారు.కష్టపడి సంపాదించిన డబ్బును అధిక లాభాల ఆశతో కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులు ఎవరన్నది తేలాల్సి ఉండగా, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.ఈ ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది.

You may also like...