మైనార్టీ గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి

కామారెడ్డి: జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది మైనార్టీ గురుకుల పాఠశాలల్లో టీఎస్ యుటిఎఫ్ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు విస్తృతంగా పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు బి.లింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంఘానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ, భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గురుకులాల ఏర్పాటు నుంచి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం టీఎస్ యుటిఎఫ్ అని పేర్కొన్నారు. గురుకుల ఉపాధ్యాయులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, ప్రతి ఉపాధ్యాయుడికి హెల్త్ కార్డులతో పాటు ఈహెచ్ఎస్ వైద్య సౌకర్యం కల్పించాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం సైతం గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాధ్యాయులు, విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఒల్లాల శ్రీనివాస్, ఎల్.చందర్ నాయక్, ఎన్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

You may also like...