రాజ్యాంగ విలువలను కాపాడాలి – సర్పంచ్ జంతుక వెంకటయ్య

1001402961.jpg

ఆమనగల్,నవంబర్ 26: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకొని ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామపంచాయతీలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జంతుక వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను కల్పిస్తుందని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడంతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు.ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, భావితరాలకు రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చిన్న జంగయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి గంగాపురం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...