భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి

sd.jpeg

భారత రాజ్యాంగ పరిరక్షణ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్, AIKS రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల ఓట్లు తొలగించారనే ఆరోపణలు ఉన్నాయని, SIR ప్రక్రియ పేరుతో ఓటు హక్కుకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేపడుతున్న విద్యార్థులు, యువతపై దాడులు, లాఠీచార్జీలు చేయడం, మీడియా స్వేచ్ఛకు ఆటంకాలు కల్పించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి అజారుద్దీన్, SFI జిల్లా ఉపాధ్యక్షుడు నల్లా సాత్విక్ రెడ్డి, జిల్లా నాయకులు నికిల్, యశ్వంత్, చరణ్, చేతన్, సాయి, నాగశ్రీ, రేవతి, స్వాతి, సుమ, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...