ప్రాథమిక సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల్లో మాల, మాదిగలకు అన్యాయం!

కామారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల నియామకాల్లో మాల, మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గైని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు అమలు చేశారని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు సామాజిక న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల కేటాయింపుల్లో మాల, మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం విచారకరమన్నారు. చైర్మన్ పదవుల్లో మాల, మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ సెల్ నాయకులు ఈ అంశంపై స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మాల, మాదిగలకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
“ఓట్లు మావి.. సీట్లు మీవా? ఈ అన్యాయం ఇకపై చెల్లదు.. చెల్లదు!” అని గైని రాజు స్పష్టం చేశారు.

You may also like...