కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి..

కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలి..

ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి

బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాదూరి వెంకట్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 28 : కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాదూరి వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో మండలవ్యాప్తంగా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. వర్షాలపై ఆధారపడి సాగు చేసిన రైతులు పంటలు చేతికందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో మండలంలోని చెరువులు, కుంటలు ఎండిపోయాయని, భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో బోరుబావుల్లో నీరు అందక పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఫలితంగా వందలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, పత్తి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేసిన రైతులకు పంటలు ఎండిపోవడంతో అప్పులు తీర్చడం భారంగా మారిందన్నారు. ఒకవైపు పెట్టుబడుల భారం, మరోవైపు పంట నష్టాలతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కట్టంగూరు మండలానికి చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించి, పంటలు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. కరువు మండలంగా ప్రకటించడంతోపాటు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సంబంధిత అధికారులు మండలంలోని వ్యవసాయ పరిస్థితులు, పంట నష్టాలపై సమగ్రంగా పరిశీలన జరిపి నివేదికను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి పరిహారం అందించే చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం కట్టంగూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, బాధిత రైతులకు న్యాయం చేయకపోతే బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెంకట్ రెడ్డి హెచ్చరించారు.1000395398.jpg

You may also like...