గురుశిష్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం భాషా బోధనలో విశిష్ట సేవలకు గుర్తింపు

ఏళ్ల క్రితం గురువు బోధించిన విద్యను ఆదర్శంగా తీసుకున్న శిష్యుడు.. నేడు అదే గురువుతో కలిసి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం విశేషంగా నిలిచింది. కట్టంగూర్‌కు చెందిన సీనియర్ హిందీ పండితుడు వాలుగొండ నరహరి, తెలుగు పండితుడు పొడిచేటి శంకర్‌కు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు లభించాయి. భాషా బోధనలో విశిష్ట సేవలు అందిస్తూ విద్యార్థుల్లో భాషపై ఆసక్తిని పెంపొందించినందుకు ఈ పురస్కారాలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ రమేష్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రఘు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, కార్యదర్శి కే. గౌరీశంకర్ చేతుల మీదుగా స్వీకరించారు. వాలుగొండ నరహరి, పొడిచేటి శంకర్ ఇద్దరూ గురుశిష్యులు కావడం ఈ పురస్కారానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఒకప్పుడు గురువు నుంచి విద్యను నేర్చుకున్న శంకర్.. నేడు అదే గురువు సరసన నిలిచి ఉపాధ్యాయుడిగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందడం పలువురిని ఆకట్టుకుంది. గురువు చూపిన బాటలో నడిచి శిష్యుడు కూడా అదే రంగంలో రాణించి పురస్కారం అందుకోవడం విద్యారంగంలో గురుశిష్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలను ఉమ్మడి జిల్లా భాషా ఉపాధ్యాయులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, దాసరి శంకర్, శీల అవిలేను, గొడితాల వెంకటేశ్వర్లు, ప్రజ్ఞాపురం వెంకన్న, కళ్లెం కృష్ణారెడ్డి, ఎర్ర హరికిషన్, గోశిక ఉమాపతి తదితరులు అభినందించారు.

You may also like...