పసిడి ధరలకు భారీ పతనం.. కొనుగోలుదారులకు ఊరట!
- పీఏసీఎస్ నామినేటెడ్ చైర్మన్ల నియామకాలు చెల్లవు! - November 20, 2026
- పసిడి ధరలకు భారీ పతనం.. కొనుగోలుదారులకు ఊరట! - November 20, 2026
- రూ.40.96 కోట్ల సీఎంఆర్ గోల్మాల్.. రేఖానాయక్‌పై ఈడీ గురి! - November 20, 2026

బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడికి అందనంత దూరం వెళ్లిన వేళ.. ఒక్కసారిగా మార్కెట్లో పసిడి ధరలు భారీగా దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్లిన బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు బ్రేకులు వేస్తున్నాయి. ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.5,120 మేర తగ్గుదల నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.4,700 పడిపోయింది. దీంతో బంగారం ధరలు మళ్లీ లక్ష రూపాయల మార్కు వైపు కదులుతున్నాయన్న చర్చ బులియన్ మార్కెట్లో ఊపందుకుంది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,570 వద్దకు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,15,100గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇక వెండి ధర కూడా పసిడికి పోటీగా పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో ధర రూ.1,75,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. అమెరికా డాలర్ విలువ బలపడటంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు తగ్గిస్తున్నారని మార్కెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర సుమారు 3.5 శాతం మేర పడిపోవడంతో ఔన్స్ బంగారం ధర 3,553 డాలర్ల స్థాయికి చేరినట్లు సమాచారం. వెండి ధర సైతం ఒక్కరోజులో సుమారు 7 శాతం దిగజారడం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, కుటుంబ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ధరల తగ్గుదల కొంత ఊరట కలిగించే పరిణామం. అయితే మార్కెట్ ఒడిదుడుకులు ఇంకా కొనసాగవచ్చని, ధరలు రోజువారీగా మారే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పసిడి ధరల పతనం ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 గ్రాముల బంగారం లక్ష రూపాయల స్థాయికి చేరుతుందా అన్న ఆసక్తి కొనుగోలుదారుల్లో నెలకొంది.
