నడవలేని స్థితిలోనూ పింఛన్ కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా మంచానికే పరిమితం.. నాలుగుసార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ఫలితం శూన్యం
- నడవలేని స్థితిలోనూ పింఛన్ కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా మంచానికే పరిమితం.. నాలుగుసార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ఫలితం శూన్యం - November 18, 2026
- సంక్షేమ పథకాల పంపిణీలో రాజకీయం చేయడం తగదు : కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు - November 18, 2026
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం : విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం - November 17, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 18 : ఒకప్పుడు సుతారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించిన గోగు యాదయ్య.. విధి చిన్నచూపుతో ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. మండల కేంద్రంలోని శ్రీరాంనగర్‌కు చెందిన యాదయ్యకు ఉన్నట్టుండి కాళ్లు, నడుము చచ్చుపడిపోవడంతో నడవలేని దుస్థితి ఏర్పడింది. కనీసం మూత్ర, మల విసర్జనకు కూడా పాకుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక స్థోమత లేక మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయిన యాదయ్య.. తనకు వికలాంగ పింఛన్ వస్తే ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని ఆశపడ్డాడు. వికలాంగత్వ ధ్రువీకరణ కోసం నల్లగొండలో నిర్వహించిన సదరం క్యాంపుకు నాలుగుసార్లు వెళ్లాడు. అయితే వికలాంగత్వ శాతం తక్కువగా వచ్చిందంటూ అధికారులు తిరిగి పంపించారని యాదయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటికీ మంజూరు కాలేదని వాపోతున్నాడు. నడవలేని స్థితిలో కార్యాలయాల చుట్టూ తిరగడం తనకు ఎంతో కష్టంగా మారిందని కన్నీటి పర్యంతమవుతున్నాడు.
పింఛన్ మంజూరు చేయాలి : గోగు యాదయ్య, శ్రీరాంనగర్
ఐదేళ్లుగా కాళ్లు, నడుము పనిచేయక నడవలేకపోతున్నా. సుతారి పని చేసుకుని బతికిన నేను ఇప్పుడు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేదు. నాలుగుసార్లు సదరం క్యాంపునకు వెళ్లినా వికలాంగత్వ శాతం తక్కువగా ఉందని పంపించారు. పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. నా పరిస్థితిని చూసి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వికలాంగ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
