మందుల ధరల దోపిడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

జ్ఞాన తెలంగాణ : ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలే సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయా? మందుల తయారీ ధరకు, రిటైలర్లు కొనుగోలు చేసే ధరకు, రోగులకు విక్రయించే ధరకు మధ్య భారీ వ్యత్యాసాలు ఎందుకు కొనసాగుతున్నాయి? ఔషధ ధరల నియంత్రణ వ్యవస్థ ఏం చేస్తోంది? దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు ఔషధ రంగంలో ధరల నియంత్రణ వ్యవస్థపై చర్చకు దారితీశాయి. మందుల ఎంఆర్‌పీకి, కొనుగోలు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఔషధ తయారీదారులకు అనుకూలంగా వ్యవస్థ మొత్తం ఎందుకు పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ధరల నియంత్రణకు బాధ్యత వహించే నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) పనితీరుపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం మంగళవారం మందుల ధరల అంశంపై దాఖలైన రెండు పిటిషన్లను విచారించింది. రిటైలర్లు కొనుగోలు చేసే ధరకు, రోగులకు విక్రయించే ధరకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటంపై ప్రశ్నలు సంధించింది. రూ.11 వేలకే లభించే మందును రూ.1.30 లక్షలకు విక్రయించడాన్ని ధరల సర్దుబాటుగా ఎలా సమర్థిస్తారని నిలదీసింది. అలాగే రూ.15కు కొనుగోలు చేసే డ్రిప్‌ లైన్‌ను రూ.250కు విక్రయించే పరిస్థితిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యత్యాసాలు కొనసాగుతుంటే ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (డీపీసీవో) లక్ష్యం ఏమిటని ప్రశ్నించింది.

దేశంలో మందుల ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశంలో ధరలను విదేశాలతో పోల్చడం మాత్రమే సరైన ప్రమాణం కాదని స్పష్టం చేసింది. రోగుల కొనుగోలు శక్తి, వైద్య ఖర్చుల భారం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ప్రజారోగ్యం కంటే వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని పేర్కొంది.

ప్రైవేటు ఆసుపత్రుల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మాట్లాడుతూ, ఆసుపత్రుల నిర్వహణకు భారీ వ్యయాలు అవుతాయని, బయట కొనుగోలు చేసిన మందుల్లో నకిలీ ఔషధాల ప్రమాదం కూడా ఉంటుందని వివరించారు. అయితే, నిర్వహణ ఖర్చుల పేరుతో మందుల ధరలను కొనుగోలు ధర కంటే 100 నుంచి 200 రెట్లు పెంచడం ఎలా సమర్థనీయమని ధర్మాసనం ప్రశ్నించింది. ఆసుపత్రులు తమ నిర్వహణ వ్యయాలను భరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, మందుల ధరల భారాన్ని రోగులపై మోపడం సరికాదని వ్యాఖ్యానించింది.

డీపీసీవో-2013 ప్రకారం షెడ్యూల్డ్‌ ఔషధాలకు ధరల పరిమితులు ఉన్నప్పటికీ, షెడ్యూల్‌లో లేని మందుల ప్రారంభ ధరలపై నియంత్రణ సరిపోవడం లేదని పిటిషనర్‌ కిషన్‌ చంద్ర జైన్‌ వాదించారు. దేశంలో సుమారు 82 శాతం మందులు షెడ్యూల్‌ పరిధిలో లేవని, దీంతో వాటి ధరల నిర్ణయంలో తయారీ సంస్థలకు అధిక స్వేచ్ఛ లభిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలోనూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్యాన్సర్‌ మందుల ట్రేడ్‌ మార్జిన్‌ను ఎంఆర్‌పీలో 30 శాతానికి పరిమితం చేయడం వల్ల ఏటా సుమారు రూ.2,500 కోట్ల వరకు రోగులకు ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇదే తరహా నియంత్రణలను ఇతర ఔషధాలకు విస్తరించడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. తాజా విచారణతో ఔషధ ధరల పారదర్శకత, నియంత్రణ సంస్థల బాధ్యత, రోగులపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాల్సిన అవసరం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

You may also like...