కీసర: డయల్–100కు తప్పుడు సమాచారం అందించి పోలీసు సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఈ నెల 24న కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య జరుగుతోందంటూ కొమ్ముల వెంకటేష్ (31) తప్పుడు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటల పాటు విచారణ చేపట్టగా ఎలాంటి ఘటన జరగలేదని తేలింది. మద్యం మత్తులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఈ-పెట్టీ కేసు నమోదు చేసి 25న న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం శిక్ష విధించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డయల్–100/112 సేవలను వినియోగించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.