కుప్రియాల్‌కు రూ.2.63 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్

కామారెడ్డి జిల్లా సదాశివనగర్: మండలంలోని కుప్రియాల్ గ్రామంలో రూ.2.63 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏడు విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన కృషి అభినందనీయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామని, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, కుప్రియాల్‌లో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనేది గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల డిమాండ్ అని, ఇచ్చిన హామీ మేరకు రూ.2.63 కోట్ల నిధులు మంజూరు చేయించి భూమిపూజ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సబ్‌స్టేషన్ నిర్మాణంతో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కుప్రియాల్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

You may also like...