వర్షాభావం వేళ.. గ్రామీణ కూలీలకు 125 రోజుల పని భరోసా!

జ్ఞాన తెలంగాణ ప్రత్యేక కథనం: వర్షాలు కురవక.. పంటలు పండక.. వ్యవసాయ పనులు లేక గ్రామీణ కూలీల బతుకులు దుర్భరంగా మారుతున్న తరుణంలో ఉపాధి కల్పనే వారికి జీవనాధారంగా నిలవాల్సిన అవసరం ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని సాగు విస్తీర్ణం తగ్గడం, పంట దిగుబడులపై అనిశ్చితి పెరగడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ పనులతో కళకళలాడిన పల్లెల్లో నేడు కూలీలకు పని దొరకని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రైతుల సాగు ఖర్చులు పెరుగుతుండగా, వ్యవసాయంపై ఆధారపడిన కూలీల కుటుంబాలకు ఆదాయ మార్గాలు కుంచించుకుపోతున్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

వీబీ జీ రాంజీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 8,83,845 అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 12,760 గ్రామ పంచాయతీల పరిధిలో పనులు చేపట్టేందుకు 31 జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. అయితే కాగితాలపై రూపొందించిన ప్రణాళికలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చినప్పుడే కూలీలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది.

ఈ పనుల కోసం రూ.6,375.52 కోట్ల విలువైన ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో కేంద్రం వాటా రూ.3,825.31 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,550.21 కోట్లు సమకూర్చనుంది. ఇంత భారీ వ్యయంతో చేపట్టే పనులు గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చేలా ఉండటం అత్యంత కీలకం. నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల నాణ్యత, కూలీలకు సకాలంలో వేతనాల చెల్లింపు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

జిల్లాలవారీగా చూస్తే నల్గొండలో అత్యధికంగా 80,496 పనులకు ఆమోదం లభించింది. ఖమ్మంలో 79,586, ఆదిలాబాద్‌లో 57,001, వికారాబాద్‌లో 56,898 పనులు మంజూరయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో అత్యల్పంగా 8,464 పనులకు అనుమతి లభించింది. ఈ పనుల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం కల్పించడం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే చర్యగా భావిస్తున్నారు. చెరువులు, కుంటల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనులు సమర్థంగా అమలైతే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల నీటి వనరులకు మేలు చేకూరే అవకాశం ఉంది.

నవంబర్‌ 1 నుంచి పనులు ప్రారంభించి వచ్చే ఏడాది జూన్‌ వరకు 125 రోజుల పని దినాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. అయితే ఉపాధి హామీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతి అర్హుడైన కూలీకి అందాలి. పనుల గుర్తింపు నుంచి వేతనాల చెల్లింపు వరకు జాప్యం లేకుండా అధికారులు పర్యవేక్షించాలి. వర్షాభావంతో కుదేలవుతున్న గ్రామీణ కుటుంబాలకు ఈ కార్యక్రమం నిజమైన అండగా నిలవాలంటే క్షేత్రస్థాయి అమలులో జవాబుదారీతనం తప్పనిసరి.

You may also like...