అయ్యర్ విధ్వంసం..విండీస్‌పై దుమ్మురేపిన భారత్
- సీఈసీ రాజీనామా వరకు పోరుఆగదు - October 7, 2026
- చౌదరిగూడెం పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు - October 7, 2026
- అయ్యర్ విధ్వంసం..విండీస్‌పై దుమ్మురేపిన భారత్ - October 7, 2026

జ్ఞాన తెలంగాణ, క్రీడా విభాగం : లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా.. అరంగేట్ర ఆటగాడు నమన ధీర్ బంతితో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ఫలితంగా భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బౌలింగ్‌లో ప్రత్యర్థిని 171 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్‌కు కెప్టెన్ శై హోప్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ అర్ధశతకాలతో కొంత ప్రతిఘటన ఇచ్చారు. శై హోప్ 37 బంతుల్లో 52 పరుగులు చేయగా.. రూథర్‌ఫోర్డ్ 34 బంతుల్లో 56 పరుగులతో దూకుడుగా ఆడాడు. అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి విండీస్‌ను భారీ స్కోరు దిశగా వెళ్లనివ్వలేదు. ముఖ్యంగా అరంగేట్రం చేసిన నమన ధీర్ అద్భుతమైన స్పిన్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ తలో వికెట్ సాధించారు. దీంతో వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభం మాత్రం అనుకున్నంతగా సాగలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ 21 పరుగులు, సంజు శాంసన్ 11 పరుగులకే పెవిలియన్ చేరడంతో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అతడికి ఇషాన్ కిషన్ అద్భుతంగా సహకరించాడు. ఇద్దరూ కలిసి విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆ తర్వాత అయ్యర్ తన బ్యాట్‌కు పని చెప్పడంతో మ్యాచ్ పూర్తిగా భారత నియంత్రణలోకి వెళ్లిపోయింది. అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి మూడో వికెట్‌కు 137 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కెప్టెన్ అయ్యర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 43 బంతుల్లో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన అయ్యర్.. వెస్టిండీస్‌పై టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రెండో వేగవంతమైన సెంచరీ సాధించాడు. 2025లో ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ 37 బంతుల్లో చేసిన శతకం ఈ జాబితాలో ముందుంది.
మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ తన తొలి టీ20 అంతర్జాతీయ శతకంపై ఆనందం వ్యక్తం చేశాడు. కలలు నిజమవుతాయని, తొలి టీ20 సెంచరీ సాధించడం ప్రత్యేక అనుభూతి అని పేర్కొన్నాడు. ఇది ఒక్కరి ప్రదర్శన కాదని, జట్టు సమష్టి కృషి ఫలితమే విజయమని చెప్పాడు. ఇదే దూకుడు, ఇదే ఆలోచనా విధానంతో కొనసాగితే టీ20 క్రికెట్లో అత్యంత దూకుడైన జట్లలో భారత్ ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
అరంగేట్ర ఆటగాడు నమన ధీర్‌పై కూడా అయ్యర్ ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బంతిని అందుకోవడానికి ధీర్ ముందుకొచ్చాడని, పిచ్‌పై లభించిన టర్న్‌ను సమర్థంగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్‌లోనే 3/31 గణాంకాలు నమోదు చేయడం ద్వారా ధీర్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌లో అయ్యర్ విధ్వంసం, బౌలింగ్‌లో ధీర్ దెబ్బతో భారత్ తొలి టీ20లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
