టీ20 లీగ్‌లపై ఐసీసీ కొరడా!
- యూపీలో కొత్త రాజకీయ కూటమి.. - November 12, 2026
- దేశ విజయగాథలను చాటిచెప్పండి.. - November 12, 2026
- పేదల ఆత్మగౌరవమే ధ్యేయం! - November 12, 2026

క్రీడా ప్రతినిధి:
ప్రపంచ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన నియంత్రణలకు సిద్ధమవుతోంది. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ప్రైవేట్ క్రికెట్ లీగ్‌లు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను దెబ్బతీయడంతోపాటు ఆటగాళ్ల అందుబాటు, ఆర్థిక ప్రయోజనాలు, పారదర్శకతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, బెట్టింగ్ సంస్థల ప్రభావం, వివిధ దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సమన్వయ లోపాలను అరికట్టేందుకు సమూల మార్పులు తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో ఏర్పాటైన సమీక్షా కమిటీ పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రిచర్డ్ గౌల్డ్, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి టాడ్ గ్రీన్బర్గ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రతిపాదనలపై బాలిలో జరగనున్న ఐసీసీ సమావేశంలో వివిధ దేశాల క్రికెట్ బోర్డుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు చర్చించనున్నారు. విదేశీ ఆటగాళ్లపై కఠిన పరిమితులు: కమిటీ చేసిన ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైనది తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్యను గరిష్ఠంగా నలుగురికే పరిమితం చేయడం. ప్రస్తుతం కొన్ని లీగ్‌లలో పెద్ద సంఖ్యలో విదేశీ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో తొమ్మిది మంది వరకు, అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఈ లీగ్‌లలో ఆటగాళ్ల ఎంపిక, జట్ల కూర్పు పూర్తిగా మారిపోవాల్సి ఉంటుంది. స్థానిక ఆటగాళ్లకు అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ స్టార్లపై ఆధారపడే ఫ్రాంచైజీల వాణిజ్య విలువ తగ్గే ప్రమాదం ఉంది. ఐసీసీ చేతుల్లో అనుమతుల అధికారం: ఇప్పటివరకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులే తమ పరిధిలోని ప్రైవేట్ లీగ్‌లకు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఇకపై ఈ ప్రక్రియపై ఐసీసీకి మరింత నియంత్రణ కల్పించాలని కమిటీ సూచించింది. అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన అనుమతులను సమీక్షించడం, నిబంధనల ఉల్లంఘన జరిగితే రద్దు చేసే అధికారం కూడా కల్పించాలని ప్రతిపాదించింది. బెట్టింగ్ సంస్థలకు చెక్: లీగ్‌లలో పారదర్శకతను పెంపొందించేందుకు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం పర్యవేక్షణను తప్పనిసరి చేయాలని సూచించింది. బెట్టింగ్ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థల స్పాన్సర్‌షిప్‌లపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించాలనే ప్రతిపాదన కూడా చర్చకు రానుంది. అయితే ఈ నిర్ణయం అమలైతే స్పాన్సర్షిప్ ఆదాయంపై ఆధారపడుతున్న పలు ఫ్రాంచైజీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఎస్ఏ20 సహా కొన్ని లీగ్‌ల వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలపై ఫ్రాంచైజీ వర్గాల్లో ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత నిబంధనల ఆధారంగా పెట్టుబడులు పెట్టిన లీగ్‌లకు కొత్త ఆంక్షలు భారీ ఆర్థిక భారంగా మారతాయని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్థానిక ప్రతిభకు ప్రాధాన్యం, అంతర్జాతీయ క్రికెట్ పరిరక్షణ, అవినీతి నియంత్రణ వంటి లక్ష్యాలతో ఐసీసీ ముందుకు సాగుతోంది. బాలిలో జరిగే సమావేశంలో చర్చల అనంతరం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ తన సిఫార్సులను ఐసీసీ బోర్డుకు పంపనుంది. తుది నిర్ణయం వెలువడితే ప్రపంచ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు కొనసాగుతున్న ఫ్రాంచైజీ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
